Spread the love

జుక్కల్, జూలై 19: ఒకప్పుడు నియోజకవర్గాన్ని ఎడ్యుకేషన్ హబ్‌గా మారుస్తామని, పంటలకు అంతర్జాతీయ మార్కెట్ కల్పిస్తామని, ప్రతి ఏటా వంద మంది పేద విద్యార్థులను విదేశాలకు పంపిస్తామని ఆశలు కల్పించిన జుక్కల్ ఎమ్మెల్యే కాంతారావు గారు.. ఇప్పుడు ఆ హామీలను ఏ మేరకు నెరవేర్చారో చెప్పాలని ప్రజలు నిలదీస్తున్నారు. అభివృద్ధి పేరుతో ఊదరగొట్టిన మాటలు ఆచరణలో శూన్యమని నియోజకవర్గ వాసులు మండిపడుతున్నారు.

అధ్వాన్నంగా రోడ్లు.. అల్లాడుతున్న పల్లెలు

శాంతాపూర్, సీతారాంపల్లి, రాజాపూర్, దోమగండి తండా, ఎల్లారం, బండ రేంజర్లు వంటి సుమారు 150 గ్రామాల్లో పరిస్థితి దయనీయంగా మారింది. గతంలో అధికారంలో ఉన్నవారిపై విమర్శలు చేసిన మీరు, ఇప్పుడు అధికారంలో ఉండి రోడ్ల దుస్థితిని ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. సరైన రవాణా సదుపాయాలు లేక, కనీసం పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు అందుబాటులో లేక ప్రజలు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు.

వలసల బాట పడుతున్న పల్లెలు

‘పల్లెలే ముద్దు’ అని ఒకప్పుడు మహనీయులు చెప్పిన మాటలను తుంగలో తొక్కుతూ, నేడు కనీస మౌలిక సదుపాయాలు లేక పల్లె ప్రజలు పట్టణాలకు వలస వెళ్తున్నారు. పల్లెల్లో డెవలప్‌మెంట్ అంటే ‘జీరో’గా మారిందని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ గాలిలో కలిసిపోయాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రజా గోస.. మీకెందుకు వినిపించడం లేదు?

“మా జుక్కల్ ప్రజలను ఆశలు చూపి మోసం చేయడానికి వచ్చారా? లేక అభివృద్ధి చేయడానికి వచ్చారా?” అని నియోజకవర్గ వాసులు సూటిగా ప్రశ్నిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్ ఆశలు, విదేశీ విద్య హామీలు ఏమయ్యాయని నిలదీస్తున్నారు. ఇప్పటికైనా నియోజకవర్గ సమస్యలపై దృష్టి సారించాలని, ముఖ్యంగా అధ్వాన్నంగా మారిన రోడ్లను బాగు చేసి ప్రజల కష్టాలను తీర్చాలని జుక్కల్ నియోజకవర్గ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.జుక్కల్ నియోజకవర్గంలో వెల్లువలా ప్రజా సమస్యలు: హామీలు ఏమయ్యాయి ఎమ్మెల్యే గారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *