Spread the love

మద్నూర్: కార్తీక మాస ఆధ్యాత్మిక శోభతో మద్నూర్ మండల కేంద్రం భక్తిపారవశ్యంలో మునిగిపోయింది. కార్తీక మాసాన్ని పురస్కరించుకొని నిర్వహిస్తున్న ప్రభాత్ ఫేరి కార్యక్రమంలో భాగంగా శనివారం తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో వందలాది మంది భక్తులు పాదయాత్రగా హనుమాన్ ఆలయానికి తరలివెళ్లారు.

మద్నూర్‌లోని బాలాజీ మందిరం నుంచి ప్రారంభమైన ఈ పాదయాత్రను స్థానిక సర్పంచ్ ఉష, సంతోష్ మేస్త్రి, ఉపసర్పంచ్ రమేష్ జెండా ఊపి ప్రారంభించారు. జంగం మహేశ్వరులుగా ఉన్న సంగయ్యప్ప, శంకరప్పలు ముందుండి శంఖనాదాలు చేస్తూ పాదయాత్రకు ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని నింపారు.

మార్వాడీ సమాజ్, రాజస్థానీ సమాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అన్ని కులాలు, వర్గాలకు చెందిన గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కాషాయ వస్త్రాలు, జెండాలు, భజన కీర్తనలతో సాగిన భక్తుల పాదయాత్ర మద్నూర్ నుంచి సలాబత్‌పూర్‌లోని హనుమాన్ ఆలయం వరకు ఉత్సాహభరితంగా కొనసాగింది.

పాదయాత్రగా ఆలయానికి చేరుకున్న భక్తులు అక్కడి శివాలయం, హనుమాన్ ఆలయాలను దర్శించుకొని ప్రత్యేక పూజలు, హారతి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. భజన పాటలు, శంఖనాదాలతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంతో మార్మోగింది. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ భక్తిశ్రద్ధలతో పాల్గొనడం విశేషం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *