Spread the love

మద్నూర్‌లో వరుస ఇళ్ల చోరీ కేసుల ఛేదన
సాంకేతిక ఆధారాలతో నిందితుల గుర్తింపు – ఇద్దరి అరెస్ట్
10 తులాల బంగారం, 50 తులాల వెండి, నగదు, మొబైల్ ఫోన్ స్వాధీనం
వివరాలు వెల్లడించిన బిచ్కుంద సర్కిల్ ఇన్స్పెక్టర్ రవికుమార్ గారు
కామారెడ్డి జిల్లా మద్నూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒకే రాత్రి జరిగిన వరుస ఇళ్ల చోరీ కేసులను పోలీసులు ఛేదించి, ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి చోరీకి గురైన బంగారం, వెండి సహా నగదు, మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.

తేదీ 04.09.2026 రాత్రి మద్నూర్ గ్రామంలో ఒక ఇంటిలో, మేనూర్ గ్రామంలోని మూడు ఇళ్లలో దుండగులు చొరబడి బంగారం, వెండి, నగదును అపహరించారు. ఈ ఘటనలపై మద్నూర్ పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

జిల్లా ఎస్పీ శ్రీ యం రాజేష్ చంద్ర, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, బాన్సువాడ డీఎస్పీ శ్రీ పి. విఠల్ రెడ్డి గారి పర్యవేక్షణలో బిచ్కుంద సీఐ శ్రీ రవికుమార్ గారు, మద్నూర్ ఎస్‌ఐ శ్రీ మోహన్ రెడ్డి గారు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు.

దర్యాప్తులో భాగంగా సాంకేతిక ఆధారాలను విశ్లేషించి చోరీలకు పాల్పడిన వారిని మహారాష్ట్రలోని బస్మత్ ప్రాంతానికి చెందిన గుండెవర్ కరణ్, శైలేష్ బాలు పవర్ @ బాబా, రాహుల్ ఎల్లప్పగా గుర్తించారు.

ఈ క్రమంలో మరోసారి చోరీ చేసేందుకు మద్నూర్ వైపు వస్తున్న గుండెవర్ కరణ్, శివ ఎల్లప్పలను తేదీ 07.10.2026న మద్నూర్ శివారులోని మిర్జాపూర్ హనుమాన్ ఆలయం వద్ద పోలీసులు చాకచక్యంగా పట్టుకుని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.1,100 నగదు, ఒక మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు.

అరెస్ట్ చేసిన నిందితులను విచారించగా, గతంలో చోరీ చేసిన బంగారం, వెండిని మహారాష్ట్రకు చెందిన మంగేష్, నౌషాద్, రైస్ అనే వ్యక్తులకు విక్రయించినట్లు వెల్లడించారు. నిందితులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఆయా వ్యక్తుల వద్ద నుంచి చోరీకి గురైన బంగారం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.

స్వాధీనం చేసుకున్న చోరీ సొత్తు:

1. 10 తులాల బంగారు ఆభరణాలు
2. 50 తులాల వెండి ఆభరణాలు
3. రూ.1,100 నగదు
4. ఒక మొబైల్ ఫోన్

ఈ కేసుల దర్యాప్తులో ఇప్పటివరకు పై చోరీ సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ కేసులను ఛేదించడంలో మద్నూర్ ఎస్‌ఐ శ్రీ మోహన్ రెడ్డి గారితో పాటు మద్నూర్ కానిస్టేబుళ్లు విఠల్, విష్ణు, సీసీఎస్ కానిస్టేబుళ్లు గణపతి, రాజేందర్, శ్రీనివాస్, లక్ష్మీకాంత్, రవి చాకచక్యంగా వ్యవహరించి నిందితులను పట్టుకోవడంలో కీలకపాత్ర పోషించారు.

సాంకేతిక ఆధారాలతో నిందితులను గుర్తించి, చోరీకి గురైన సొత్తును స్వాధీనం చేసుకోవడంలో సమర్థవంతంగా పనిచేసిన పోలీసు అధికారులను, సిబ్బందిని జిల్లా ఎస్పీ శ్రీ యం రాజేష్ చంద్ర, ఐపీఎస్ గారు అభినందించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *